వారణాసి : ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మహిళలకు భద్రత కరువవుతున్నది. డిప్యూటీ జైలర్ అయిన తన తల్లిని ఆమె సీనియర్లు వేధిస్తున్నారని ఆమె కూతురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం లేఖ రాశారు. ఆ వేధింపులను తమ కుటుంబం తట్టుకోలేకపోతున్నదని.. తామంతా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. ‘అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా పోరాడితే, మన అంతం తప్పదన్న విషయం నాకు తెలుసు. అందుకే నా జీవితాన్ని ముగించడానికి మీ అనుమతి కోరుతున్నా’ అని బాధితురాలు మీనా కనోజియా కూతురు నేహా సింగ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వారణాసి జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఉమేశ్ కుమార్ సింగ్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో గత నెలలో తాను ఫిర్యాదు చేశానని నేహా పేర్కొన్నారు.
తన తల్లిది ఎస్సీ కులమని.. ఆమెను ఉమేశ్ శారీరకంగా, మానసికంగా హింసించారని, కులం పేరుతో దూషించారని ఆమె ఆరోపించారు. తన తల్లికి ఆయన అసభ్య సైగలు చేసి, ఇంటికి రమ్మని పిలిచారని చెప్పారు. అతడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ప్రతిసారి అతడికి జైలు ప్రధాన కార్యాలయం నుంచి క్లీన్చిట్ లభిస్తున్నదని వెల్లడించారు. ‘ఇటీవల ఉమేశ్ సింగ్ సన్నిహిత సహాయకుడు అశ్వని పాండే జైలు ఆఫీసులా కనిపిస్తున్న చోట ఒక మహిళను దుస్తులు విప్పమని బలవంతం చేస్తున్న దృశ్యాలున్న వీడియోలు బయటకొచ్చాయి. అయితే అవి జైల్లోని దృశ్యాలు కావని అధికారులు పేర్కొంటున్నారు’ అని నేహా తెలిపారు. ఉమేశ్ సింగ్‌ను సస్పెండ్ చేయకపోతే అతడు తమ కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.