న్యూఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జంతుశాల వంతారా(Vantara) కీలక విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చేపట్టబోయే దర్యాప్తుకు సహకరించనున్నట్లు జంతు సంరక్షణ కేంద్రం వంతారా పేర్కొన్నది. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విదేశాల నుంచి కానీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతువులను సంరక్షణా కేంద్రానికి తీసుకురావడంలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పంకజ్ మిఠల్, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం.. నలుగురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసింది. మాజీ జడ్జీ జే చలమేశ్వర్ ఆ సిట్ బృందానికి అధిపతిగా ఉండనున్నారు. జామ్‌నగర్‌లో ఉన్న జంతుశాల వంతారాపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఆ సిట్ బృందానికి ఆదేశాలు ఇచ్చారు. మహాదేవి ఏనుగు కేసులో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు.