Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. ప్రయాణికుల నుంచి సెమీ హైస్పీడ్ రైళ్లకు ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ సరికొత్తగా అంతర్జాతీయ సదుపాయాలతో వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది. ఈ రైలు ట్రయల్ రన్‌ను సైతం వివిధ మార్గాల్లో విజయవంతంగా నిర్వహించింది. తాజాగా వందే భారత్ స్లీపర్ వెర్షన్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్ అందించారు. స్లీపర్ రైళ్ల కార్యకలాపాలు అక్టోబర్ 15 తర్వాత ప్రారంభమవుతాయని తెలిపారు. రెండు రేక్ డిలివరీల కోసం భారత రైల్వేలు నిరీక్షిస్తున్నాయని.. ఈ క్రమంలో ప్రారంభోత్సవంలో కాస్త ఆలస్యం జరుగుతోందన్నారు.
ఒకేసారి రెండు స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. అవి రోజువారీ సేవల కోసం ఉద్దేశించినవని.. రెండు రేక్‌లు సిద్ధంగా ఉండాలన్నారు. రెండో రైలు అక్టోబర్ 15 నాటికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు, మెరుగైన భద్రత, ప్రయాణికులకు అనుకూలమైన సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను రైల్వేశాఖ తీసుకువస్తున్నది. తొలి రైలు ఢిల్లీ-పాట్నా మధ్య రాకపోకలు సాగించనున్నది. ప్రస్తుతం రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 12నుంచి17 గంటల పడుతుందని.. స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి వస్తే 11 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రోటోటైప్ వందే భారత్ స్లీపర్ రైలు 800 నుంచి 1200 కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణాల కోసం రైల్వేశాఖ తీర్చిదిద్దింది. ఇందులో 16 నుంచి 20 కోచ్‌లు ఉండనున్నాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు రెండు జనరల్ ఫస్ట్ ఏసీ, సెకండ్, థర్డ్ కాకుండా, రెండు సీటింగ్ కం లగేజీ కోచ్‌లు సైతం ఉంటాయి. రైలులో దాదాపు 820 నుంచి 1200 మంది వరకు ప్రయాణం చేయొచ్చు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భద్రతతో పాటు, స్లీపర్ వెర్షన్లో యూఎస్బీ ఛార్జింగ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు, పబ్లిక్ అనౌన్స్మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మాడ్యులర్ ప్యాంట్రీలు, దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్స్ తదితర ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉండనున్నాయి.
మొదటి ఏసీ కోచ్‌లో వేడినీటితో కూడిన షవర్లు సైతం ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరుచనున్నాయి. మధ్యతరగతి కోసం ఉద్దేశించిన రైలని.. ఛార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని గతంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు సౌకర్యవంతమైన, సరసమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు. అయితే, వందే భారత్ స్లీపర్ రైలును దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య నడిపేందుకు రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి. న్యూఢిల్లీ-సికింద్రాబాద్, న్యూఢిల్లీ-హౌరా, ఢిల్లీ-పుణే, ముంబయి-ఢిల్లీ నగరాలను కలుపుతూ రైలు నడుపనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పట్నా-ఢిల్లీ మధ్య స్లీపర్ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.