Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ (Indian Railway) ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే వందే భారత్‌లో స్లీపర్ (Vande Bharat Sleeper) వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అయితే, ఇప్పటికే విజయవంతంగా ట్రయల్స్ పూర్తి కాగా.. ఎప్పుడు పట్టాలెక్కిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రారంభిస్తారంటూ వార్తలు వచ్చినా ఇప్పటి వరకు మాత్రం స్లీపర్ రైళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్లీపర్ రైళ్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, సురక్షితమైన ప్రయాణం అందించేందుకు తొలి వందే భారత్ స్లీపర్ రైలులో ప్రస్తుతం చిన్న మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైలును డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలి స్లీపర్ రైలు ప్రయాణికులకు ఉన్నతస్థాయి సౌకర్యాలు, వేగం రెండింటినీ అందిస్తుంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత విషయంలో రాజీపడబోమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
వందే భారత్ స్లీపర్ రైలు రేక్‌ను ఇప్పటికే పలు స్థాయిల్లో పరీక్షించారు. ఈ ట్రయల్స్ తర్వాత సీట్లు, బోగీలకు సంబంధించి పలు మార్పులు చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రయల్స్ సమయంలో చేసిన సూచనలు తొలి, రెండో రైళ్లలో అమలు చేస్తున్నట్లు రైల్వేమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం, ఈ మొదటి ప్రోటోటైప్ రేక్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) వద్ద ఉన్నది. ఇక్కడ రెట్రోఫిటింగ్ పనులు జరుగుతున్నాయి. మొత్తం ప్రక్రియను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO), కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్యవేక్షిస్తున్నాయి. బీఈఎంఎస్కు రైలును తిరిగి అప్పగించారు. సూచనల మేరకు సాంకేతిక మెరుగులు దిద్దుతున్నట్లు బీఈఎంఎల్ అధికారులు సైతం ధ్రువీకరించారు. అయితే, గత నెలలో రైల్వేమంత్రిత్వశాఖ ఆర్డీఎస్వోకు అనేక భద్రతా ప్రమాణాల విషయంలో కీలకమైన లేఖ రాసింది. ఇందులో ఫైర్ సేఫ్టీ, యాక్సిడెంట్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన యూరోపియన్ స్టాండర్డ్స్ పాటించేలా చూడాలని చెప్పింది.
ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ వెర్షన్లో ఆర్క్ ఫాల్ట్ డిటెక్షన్ పరికరం (అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి), గాలి ప్రసరణ పెంచేందుకు ఏసీ డక్ట్‌ను కొత్త స్థానంలో బిగింపు, సీసీటీవీ కోసం ఫైర్ సర్వైవల్ కేబుల్, ఫైర్ ప్రొటెక్షన్ థర్డ్ పార్టీ ఆడిట్ (EN 45545), క్రాష్ వర్తినెస్ థర్డ్ పార్టీ ఆడిట్ (EN 15227) పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ట్రయల్స్ సమయంలో కీలకమైన సమస్యను గుర్తించారు. అన్నికోచ్లలో అత్యవసర సైరన్ బటన్ అప్పర్ బెర్త్ కనెక్టర్ వెనుక ఉంటుంది. దాంతో ప్రయాణికులు అత్యవసర సమయాల్లో దాన్ని నొక్కడం కష్టమవుతుంది. కోచ్‌లలో ప్రయాణీకులందరికీ సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో ఈ బటన్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా ఆదేశించింది.
మరో లేఖలో ఫర్నిషింగ్ల నాణ్యత, కోచ్‌ల లోపల జరిగే పనుల విషయంలో రైల్వే పలు ప్రశ్నలు లేవనెత్తింది. రైలు ప్రీమియంగా కనిపించడమే కాకుండా.. దీర్ఘ ప్రయాణాలలో దృఢంగా, మన్నికగా ఉండేలా డిజైన్ఫి, ఫినిషింగ్‌ను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభోత్సవం ఎప్పుడు అన్న ప్రశ్నలకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. వాస్తవానికి అక్టోబర్ 15న ప్రారంభించాల్సి ఉందన్నారు. క్వాలిటీ, సేఫ్టీ వర్క్స్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని.. డిసెంబర్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని వివరించారు.