న్యూఢిల్లీ: వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat Sleeper Express)ను భారతీయ రైల్వేశాఖ ప్రారంభించనున్నది. ఢిల్లీ నుంచి పాట్నా మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 22వ తేదీన ప్రస్తుత అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. అయితే ఆ తేదీలోగానే ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నవంబర్ 15లోగా ఎన్నికలు జరగడం ఖాయంగా తోస్తోంది. ఇప్పటి వరకు కేవలం డే జర్నీ వందేభారత్ రైళ్లను మాత్రం స్టార్ట్ చేశారు. అయితే వందేభారత్ స్లీపర్ రైళ్ల వల్ల రాత్రి జర్నీ కూడా సుఖంగా సాగనున్నది. దీపావళి సీజన్ సందర్భంగా ఆ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ, పాట్నా మధ్య ప్రయాగ్‌రాజ్ మార్గంలో వెళ్లే వందేభారత్ రైలు కేవలం 11.5 గంటల్లో తన జర్నీ పూర్తి చేస్తుంది. అయితే ఇదే మార్గంలో వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు 23 గంటల సమయం పడుతోంది.
బీఎంఈఎల్ కంపెనీ వందేభారత్ స్లీపర్ రైలును ఉత్పత్తి చేస్తున్నంది. ప్రస్తుతం రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ట్రావల్ ఆప్షన్ల కంటే ఆధునిక రీతిలో వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెడుతున్నారు. ఆ రైలు గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందేభారత్ స్లీపర్ రైళ్లలో కేవలం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిల్లో 11 ఏసీ-3 టైర్ కోచ్‌లు, రెండు ఏసీ 2 టైర్, ఓ ఏసీ ఫస్ట్‌క్లాస్ కోచ్ ఉంటుంది. సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు ఉన్నాయి.