Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. సెమీ హైస్పీడ్ రైళ్లను జాతికి అంకితం చేశారు. మూడు రైళ్లను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కొత్త రైళ్లు లక్నో-సహరన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, వారణాసి-ఖజురహో, బెంగళూరు-ఎర్నాకుళం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. అందరికీ ప్రత్యేక అనుభవాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రయత్నంగా పేరొన్నారు. కాశీలో ఆరోగ్య సేవలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. పది పదకొండేళ్ల కిందట ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స పొందడం కష్టంగా ఉండేదని.. ప్రజలకు ఒకే ఒక ఆప్షన్ ఉండేది అదే బీహెచ్‌యూ మాత్రమేనన్నారు.
రాత్రంతా నిలబడినా బెడ్ పొందలేకపోయారని.. క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్య వచ్చినా చికిత్స పొందేందుకు ఇబ్బందులుపడేవారన్నారు. కాశీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం మహామన క్యాన్సర్ ఆసుపత్రితో సహా అనేక ఆసుపత్రులు నిర్మించిందన్నారు. భారత్‌ల శతాబ్దాలుగా తీర్థయాత్రను దేశ చైతన్యానికి మాధ్యమంగా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ తీర్థయాత్రలు కేవలం దేవుని దర్శనానికి మార్గం మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మను కలిపే పవిత్ర సంప్రదాయమన్నారు.
ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర వంటి లెక్కలేనన్ని తీర్థయాత్రలు మన ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయని.. నేడు ఈ పవిత్ర స్థలాలను వందే భారత్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నప్పుడు, ఓ విధంగా భారతదేశ సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధిని అనుసంధానించే పని కూడా జరిగిందన్నారు. భారతదేశ వారసత్వ నగరాలను దేశ అభివృద్ధికి చిహ్నంగా మార్చే దిశగా ఇది ఒక కీలకమైన అడుగని.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వనరులను మెరుగుపరిచేందుకు.. ఈ రైళ్లు దానిలో ఒక మైలురాయిగా మారబోతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు నేడు తర్వాతి తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వందే భారత్ అనేది భారతీయుల కోసం, భారతీయులచే.. భారతీయుల కోసం తయారు చేయబడిన రైలని.. ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని ప్రధాని చెప్పుకొచ్చారు.