Vande Bharat Express | ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్‌పైకి వచ్చిన పశువులను ఢీ కొట్టింది. తాజాగా మరోసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
తాజా ఘటనపై పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఉద్వాడ – వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. చిన్నపాటి డెంట్ ఏర్పడింది. కొద్దిసేపు ఆగిన రైలు.. 6.35 గంటలకు తిరిగి ప్రారంభమైంది’ అని తెలిపారు.