న్యూఢిల్లీ, మే 2: గత ఆర్థిక సంవత్సరంలో మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ జరిపిన అరెస్టులు సుమారు 27 శాతం తగ్గినప్పటికీ జప్తు చేసిన ఆస్తుల విలువ మాత్రం రూ.81 వేల కోట్లకు పైగా రికార్డు స్థాయిలో నమోదైంది. ఆ సంస్థ వార్షిక నివేదిక ఈ గణాంకాలను తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)కు చెందిన కఠిన నిబంధనల కింద ఈడీ నిర్వహించిన సోదాలు లేదా దాడులు 2025-26లో దాదాపు రెట్టింపు అయ్యి 2,892కి చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో 812 చార్జ్షీట్లు నమోదయ్యాయి. నేరగాళ్ల ఆదాయం, అరెస్టు చేసే అధికారం, సోదాలు, స్వాధీనం చేసుకోవడం, ఆస్తులను జప్తు చేసుకోవడం వంటి విషయాల్లో పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల వల్ల బెయిల్ పొందడం కూడా చాలా కష్టంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసానికి గురైన బాధితులకు జప్తు చేసిన ఆస్తులను తిరిగి అప్పగించాలన్న తన లక్ష్యాన్ని ఈడీ రెట్టింపు అధిగమించింది. ఆ కాలంలో రూ.32 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. 2025 ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం 2026 మార్చి 31 నాటికి రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించాలని ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో 214 మందిని ఈడీ అరెస్టు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 156 మందిని అరెస్టు చేసింది.