చెన్నై : నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు వి కామకోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష పేపర్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) చేరకముందే లీక్ అయిందన్నారు. 2024లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు రంగనాథన్ కమిటీ ఇచ్చిన కీలక సిఫారసులను పూర్తిగా అమలు చేసి ఉంటే పేపర్ లీక్ అయ్యేది కాదన్నారు. ఆ కమిటీ 250 సూచనలు చేస్తే వాటిలో కీలకమైనవి ఇంకా అమలు చేయలేదని కామకోటి చెప్పారు.
ఎన్టీయే ఆ సూచనలను చాలా వరకు పాటించింది కాబట్టే ప్రింటింగ్, పంపిణీ సమయంలో పేపర్ లీక్ జరగలేదని.. పేపర్‌ను సిద్ధం చేసిన నిర్వాహకుల వద్దే ఇది జరిగి ఉండొచ్చన్నారు. విచారణలో ఇవే విషయాలు తెలుస్తున్నట్టు కామకోటి తెలిపారు. జేఈఈ ఎగ్జామ్ పేపర్‌ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించడం వల్ల లీకేజీ కాకుండా చూడగలిగామని.. మిగతా జాతీయ స్థాయి పేపర్ల విషయంలోనూ దాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికీ పెన్ను-పేపర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని.. వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.