న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత్‌లో తయారైన దగ్గు మందు (సిరప్) తాగి తమ దేశంలో ఇటీవల 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ ఆరోపించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ తయారుచేసిన డాక్-1 మాక్స్ సిరప్ తాగడం వల్లే చిన్నారులు మరణించారని పేర్కొన్నది. ఈ సిరప్‌ను పరీక్షించగా విషపూరితమైన ఇథిలిన్ ైగ్లెకాల్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించామని చెప్తున్నది.
ఆ దేశంలోని అన్ని ఫార్మసీల్లో ఈ సిరప్ అమ్మకాలను నిలిపివేసింది. సంస్థపై న్యాయపరమైన విచారణ ప్రారంభించింది. కాగా, ఈ ఘటనపై భారత్ స్పందించింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీనిపై విచారణ చేపట్టింది. యూపీ డ్రగ్స్ రెగ్యులేటరీ బృందంతో కలిసి మరియన్ బయోటెక్‌లో తనిఖీలు చేపట్టి శాంపిళ్లు సేకరించింది. ఈ ఘటనపై అదనపు సమాచారం ఇవ్వాలని ఉజ్బెకిస్థాన్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోరింది. విచారణ తర్వాత ఫార్మా సంస్థపై చర్యలు తీసుకొంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు.
అటు.. ఈ సిరప్లు భారత్‌లో అమ్మలేదని తేలింది. ఉజ్బెకిస్థాన్‌కు మాత్రమే ఎగుమతయ్యాయని వెల్లడైంది. గతంలో గాంబియాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. ఉజ్బెకిస్థాన్ ఘటనపై రాజకీయ దుమారం మొదలైంది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ ఘటనలు చూస్తుంటే మేడిన్ ఇండియా సిరప్లు ప్రాణాంతకంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రపంచానికి మన దేశంలో ఫార్మసీ అని గొప్పలు చెప్పుకోవడం మానేసి, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.