న్యూఢిల్లీ, ఆగస్టు 21 : విద్యుత్తు చార్జీల మాఫీ, పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉత్తరాఖండ్ రైతులు రోడ్లమీదికు వచ్చారు. శుక్రవారం ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ ప్రాంతంలోని రైతులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. పెన్షన్, భూ యాజమాన్య హక్కులు సహా పలు డిమాండ్లపై రైతులు నిరసనబాట పట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ (టికాయత్) వర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనల్లో రైతులు బారికేడ్లను ఛేదించుకొని కలెక్టరేట్ కార్యాలయం వైపు దూసుకుపోయారు.
కలెక్టరేట్ గేటు బయట రైతులు బైఠాయించి నిరసన చేపట్టారు. రైతుల నిరసనను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు పోలీసు బలగాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపారు. కలెక్టరేట్ బయట, ఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల్ని మోహరించారు.