డెహ్రాడూన్, ఆగస్టు 25: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది. సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అన్ని పరీక్షలను రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ కేసులో పూర్తి దర్యాప్తు జరుపాలని, తప్పు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు.
వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమించి, నియామక ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎస్టీఎఫ్ 22 మందిని అరెస్టు చేసింది. వారిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నియామక పరీక్షల్లో ఒక్కో అభ్యర్థి నుంచి 12- 15 లక్షలు వసూలు చేసి, వారి ప్రశ్న పత్రాలను ఉద్యోగులే నింపారని తెలుస్తున్నది. కాగా, ఈ స్కాం దర్యాప్తును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని కమిటీతో జరిపించాలని కాంగ్రెస్ బృందం ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.