(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్నెల్లుగా సరిపడా నిధులు విడుదల చేయడం లేదు. ‘మీరేమైనా చేసుకోండి.. పథకాన్ని అమలు చేయాల్సిందే’నన్న ఉన్నతాధికారుల హకుంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒక్క కాన్పూర్ జిల్లాలోనే మధ్యాహ్న భోజన పథకం బకాయిలు రూ.20 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో ఈ పథకం అస్తవ్యస్థంగా తయారైందనే దానికి ఇదో ఉదాహరణ. నిధులలేమితో ఇబ్బందులు పడుతున్నామని, అప్పుల పాలవ్వాల్సి వస్తున్నదని కాన్పూర్‌లోని ఓ ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయాలు, ఇతర సరుకులు కొనేందుకు నిధులు సరిపోక, అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
మీరేమైనా చేసుకోండి
నిధులు రాకపోయినా, మధ్యాహ్న భోజన పథకం అమలును ఆపకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారని బాధిత హెచ్ఎం పేర్కొన్నారు. ‘అప్పులు చేస్తారో.. అస్తులు అమ్ముకుంటారో అది మీ ఇష్టం. పథకాన్ని మాత్రం ఆపకూడదు’ అని హుకుం జారీచేశారని చెప్పారు. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు చేస్తున్న అప్పుల వల్ల తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారని, తమ జీతం అంతా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. యూపీలోని ప్రతి జిల్లాలో కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ వెబ్సైట్లో మధ్యాహ్న భోజన పథక వివరాలను 2020 నుంచి అప్డేట్ చేయలేదు.
వంట వారికీ జీతాల్లేవ్
గత ఆరు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు (వంట మనుషులు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.77 లక్షలకు పైగా కుక్‌లు పనిచేస్తుండగా, వారికి నెలకు రూ.2,000 గౌరవ వేతనంగా ఇవాల్సి ఉంటుంది. ఆగ్రా జిల్లాలో పనిచేసే శశికుమారి అనే వంట మనిషి మాట్లాడుతూ ఆర్నెల్లుగా వేతనం రావడం లేదని, భర్త చనిపోవడంతో ఈ ఉద్యోగం చేస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణలో నిధులు ఎప్పటికప్పుడు విడుదల
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. ఏడాదికి రూ.350 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడుతుండగా, ఇప్పటికే రూ.180 కోట్లు విడుదలయ్యాయి. మరో రూ.25 కోట్లు కూడా ప్రభుత్వం గత వారం మంజూరు చేయగా ఈ వారం విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.