భదోహి (యూపీ), ఆగస్టు 23: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో దళితులపై ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. యూనిఫామ్ ధరించలేదనే సాకుతో దళిత బాలికను కులం పేరుతో తిట్టి, కొట్టి బయటకు గెంటివేశారు. నిందితుడిని మాజీ గ్రామ పెద్ద మనోజ్‌కుమార్ దుబేగా గుర్తించినట్టు చౌరాయి పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి గిరిజాశంకర్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. నిందితుడు అధికారి, ఉపాధ్యాయుడు కాకపోయినప్పటికీ రోజూ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, టీచర్లతో తప్పుగా ప్రవర్తిస్తాడని తెలిపారు. 8వ తరగతి విద్యార్థిని స్కూల్ యూనిఫామ్ ధరించకపోవడంపై సోమవారం అతడు ప్రశ్నించాడని పేర్కొన్నారు. తన తండ్రి యూనిఫామ్ ఇంకా కొనలేదని, కొనగానే ధరిస్తానని బాలిక సమాధానం ఇచ్చినట్టు వెల్లడించారు. తరగతిలో ఉన్న బాలికను కులం పేరుతో దూషించి, కొట్టి స్కూల్ నుంచి దుబే బయటకు గెంటివేశాడని తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై దాడి, బెదిరింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు.