లక్నో: కాల్పుల ఘటన తర్వాత బీజేపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ తర్వాత ఆయనను వదిలేశారు. ఆ తర్వాత ఆ బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అయితే ఆయనను అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం ఆరోపించింది. (BJP leader missing) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. హమీర్పూర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కిసాన్‌కు పెట్రోల్ బంకు ఉన్నది. అక్టోబర్ 18 అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు బంకు సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ ఉన్న రైఫిల్‌తో ప్రీతమ్ సింగ్ కాల్పులు జరిపాడు.
కాగా, కాల్పుల సమాచారం తెలుసుకున్న 25 మంది పోలీసులు ఆ పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. ప్రీతమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ ఉన్న రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు ఆ మరునాడు పోలీస్ స్టేషన్ వద్ద ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. దీంతో ప్రీతమ్ సింగ్‌ను పోలీసులు వదిలేశారు. ఆయనను కారులో ఇంటి వద్ద దించినట్లు కొందరు వ్యక్తులు తెలిపారు. అక్టోబర్ 21, 23న తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు.
కాగా, అక్టోబర్ 19 నుంచి ప్రీతమ్ సింగ్‌ను పోలీసులు అక్రమంగా కస్టడీలో ఉంచినట్లు ఆయన కుటుంబం ఆరోపించింది. ఆయన మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో హాజరుపర్చాలని కోరుతూ అక్టోబర్ 27న అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు అదృశ్యమైన బీజేపీ నేత ప్రీతమ్ సింగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన మొబైల్ ఫోన్ ట్రాక్ చేయగా పెట్రోల్ బంకు పక్కనే ఉన్న ఆయన నివాసం వద్ద చివరిసారి ఉన్నట్లు గుర్తించారు. గెజిటెడ్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఆ ఇంట్లో సోదా చేసినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు.
కాగా, ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు ప్రీతమ్ సింగ్ సన్నిహితుడు. 2007 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతమ్ సింగ్ అదృశ్యం కావడం కలకలం రేపింది.
Also Read:
Fake Doctors Hub | నకిలీ డాక్టర్లకు అడ్డాగా ఆ జిల్లా.. మూడు నెలల్లో 17 మంది అరెస్ట్
Woman Pushed Of Moving Train | కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు