Mobile Phone | న్యూఢిల్లీ: నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను స్క్రోల్ చేసేవారు వారానికి దాదాపు 50 నిమిషాల నిద్రను కోల్పోతారని తాజా పరిశోధన వెల్లడించింది. మెదడు కూడా దెబ్బ తినొచ్చని హెచ్చరించింది.రోజూ స్క్రీన్ టైమ్ వల్ల శరీరంలోని జీవ గడియారం క్రమం తప్పుతుందని తెలిపింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు తమ తాజా అధ్యయన నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు. 1,22,000 మందిపై ఈ అధ్యయనం జరిగినట్లు పరిశోధకులు తెలిపారు. వీరిలో 41 శాతం మంది తాము రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను వాడతామని చెప్పగా, 17.4 శాతం మంది ఆ సమయంలో తాము ఫోన్ను వాడటం లేదని తెలిపారు. ఆ సమయంలో ఫోన్ను వాడనివారి కన్నా వాడేవారి నిద్ర సక్రమంగా పట్టకపోయే అవకాశాలు 33 శాతం ఎక్కువగా కనిపించాయి.
మెలటోనిన్ హార్మోన్ నిద్ర పోవడం-మేలుకోవడం క్రమబద్ధంగా జరిగేలా సాయపడుతుంది. ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుగును చూడటం వల్ల మెలటోనిన్ విడుదల ఆలస్యమవుతుందని, ఫలితంగా సహజ నిద్రకు భంగం కలుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. నిద్రకు ఉపక్రమించే ముందు 30 నిమిషాలపాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్ర పోవడంలో అంతరాయాలు, కలత నిద్ర సమస్యను ఎదుర్కొనడం 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిద్ర కోల్పోవడమనేది వ్యక్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యకలాపాల నిర్వహణ, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణ, సావధానంగా ఉండేలా చేసే మెదడులోని భాగాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. దీంతో దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, వ్యాకులత రుగ్మతలకు దారి తీస్తుందని వివరించారు.