బెంగళూరు: తిరుపతిలోని శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయ్యిందన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని దేవాలయ బోర్డు పరిధిలోని 34,000 ఆలయాల్లో తప్పని సరిగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని (Nandini Ghee) మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.
కాగా, ఆలయాల్లో దీపాలు వెలిగించడం కోసం, ప్రసాదం తయారీ, ఇతర ఆచారాల కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులకు అన్నదానం, ప్రసాదం నాణ్యతలో రాజీ పడవద్దని ఆలయ సిబ్బందికి సూచించింది. ‘కర్ణాటక రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నోటిఫై చేసిన అన్ని దేవాలయాలలో సేవలు, దీపాలు, అన్ని రకాల ప్రసాదాల తయారికి, దాసోహ భవన్లో క్రతువులకు నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఆలయాల్లో తయారు చేసే ప్రసాదాల నాణ్యతను కొనసాగించాలి’ అని ఆ ఉతర్వులో పేర్కొన్నారు.