హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ప్రయాణాలపై తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భద్రతా ముప్పు ఉన్నట్టు పేర్కొన్నది. ఇక్కడ ప్రయాణించేందుకు అమెరికా ప్రభుత్వ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది.
ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్నారని తెలిపింది. జార్ఖండ్, తెలంగాణతో సరిహద్దు పంచుకునే ఛత్తీస్‌గఢ్ గ్రామాలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ర్టాల్లో భారత ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నది. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు, ఇతర లొకేషన్స్‌లో లైంగిక నేరాలు పెరుగుతున్నాయని, ఆయా ప్రాంతాలకు మహిళలు ఒంటరిగా వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.