US-India Tariffs Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి సుంకాలపై కాకుండా కొత్త వాదనలు తెరపైకి తీసుకువచ్చారు. భారత్ ఏకపక్ష వాణిజ్య సంబంధాలను కలిగి ఉందని ఆరోపించారు. భారత్ చాలాకాలంగా అమెరికాను తన పెద్ద కస్టమర్‌గా భావించిందని.. కానీ ప్రతిగా అమెరికాకు భారత్‌లో వ్యాపారం చేసేందుకు చాలా తక్కువ అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అసమతుల్యత ఉందని.. ఇప్పుడు భారత్ సుంకాలను తగ్గించేందుకు ప్రతిపాదించిందని.. కానీ, చాలా ఆలస్యమైందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ అమెరికాకు భారీ మొత్తంలో వస్తువులను విక్రయిస్తుందని.. అమెరికన్ కంపెనీలు అక్కడ చాలా తక్కువ ఉత్పత్తులను విక్రయించగలవన్న ట్రప్.. దీనికి భారత్ అధిక సుంకాలను విధిస్తుందంటూ ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని.. అమెరికన్ ఉత్పత్తులు భారత మార్కెట్‌ను చేరుకోలేకపోవడానికి ఇదే కారణమని.. దాన్ని ‘పూర్తి ఏకపక్ష విపత్తు’ (Total One Sided Disaster)గా విమర్శించారు. భారత్ తన చమురు, సైనిక అవసరాలను రష్యా నుంచి తీర్చుకుంటుందని.. అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోళ్లు చేస్తుందన్నారు.
ఈ పరిస్థితి వాణిజ్య అసమతుల్యతను కూడా తీవ్రతరం చేస్తుందని చెప్పుకొచ్చారు. భారతదేశం తన వాణిజ్య వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. కానీ అది చాలా ఆలస్యమైందని.. అమెరికా చాలా కాలంగా నష్టాలను చవిచూసిందని ట్రంప్ భావిస్తున్నారు. భారత్ తన సంకాన్ని సున్నాకి తగ్గించుకునేందుకు ముందుకువచ్చిందని.. కానీ, ఈ చర్య చాలా ముందుగానే తీసుకొని ఉండాల్సిందని.. ఇప్పుడు అది ఆలస్యమైందన్నారు. అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని సాధారణ వాస్తవాలన్నారు. భారతదేశం-అమెరికా సంబంధాలపై ప్రభావం రాబోయే కాలంలో భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలలో ఒత్తిడి ఉండవచ్చని ట్రంప్ తాజా ప్రకటనతో అవగతమవుతున్నది. భారత్ చాలాకాలంగా అమెరికాకు కీలకమైన భాగస్వామిగా భావిస్తుండగా.. ప్రస్తుతం వాణిజ్య లోటుపై ట్రంప్ ఇటీవల కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. సుంకాల ఉద్రిక్తతలకు సంబంధించి పరిష్కారం గుర్తించకపోతే రెండుదేశాల మధ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.