బెంగళూరు, జనవరి 17: అమెరికా తన కాన్సులేట్‌ను శుక్రవారం బెంగళూరులో ప్రారంభించింది. అమెరికా నిర్ణయాన్ని గణనీయమైన మైలురాయిగా అభివర్ణించిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్.. టెకీలు, వ్యాపార సందర్శకులు, విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరం కాగలదని ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఈ కాన్సులేట్‌లో వీసా సర్వీసులు వెంటనే అందుబాటులో లేనప్పటికీ సాధ్యమైనంత త్వరలో ఆ సర్వీసులను తీసుకువస్తామని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి ఈ సందర్భంగా తెలిపారు. వాణిజ్య, సైన్స్, టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర అవగాహన పెంపునకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ప్రారంభించిన అమెరికన్ కాన్సులేట్ దేశంలో ఐదవది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతాలో అమెరికా కాన్సులే ట్ కార్యాలయాలు ఉన్నాయి.