Supreme Court | సుప్రీంకోర్టులో మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూజా ఖేద్కర్ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందించేందుకు గడువు కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసు విచారణ జరిగే వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. పూజాకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె ఎవరి సహాయంతో ఫేక్ దివ్యాంగుల సర్టిఫికెట్ తయారు చేయించిందో తెలుసుకోవచ్చన్నారు. ఆ సర్టిఫికెట్ కారణంగానే పూజా ఖేద్కర్‌కు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైందని ధర్మాసనం దృష్టించి తీసుకువచ్చారు.
పూజా తరఫున సీనియర్ న్యాయవాది బీనా మాధవన్ కోర్టుకు హాజరయ్యారు. దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనంపై విచారణలో జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. 2022 యూపీఎస్సీ పరీక్షకు ఫొర్జరీ డాక్యుమెంట్స్ సమర్పించినట్లుగా ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. కేసు విచారణకు సహకరిస్తానని.. ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఊరట లభించింది. అయితే, పూజా ఖేద్కర్ శిక్షణ సమయంలో వసతి, సిబ్బంది, కారు, కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, ఐఏఎస్ అయ్యేందుకు ఫేక్ పత్రాలను సమర్పించారని.. యూపీఎస్సీ ఫామ్‌లో ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌గా, దృష్టిలో లోపం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్నది.