న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కేంద్రం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకానికి (UPS) ఉద్యోగుల నుంచి పేలవమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను ప్రారంభించినప్పటికీ, మొత్తం 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం లక్ష మంది లేదా 4 శాతం మంది మాత్రమే ఈ పథక ఎంపికను ఉపయోగించుకున్నారు. యూపీఎస్ స్వీకరణకు మొదట గడువును జూన్ 30గా ప్రకటించిన కేంద్రం తర్వాత దానిని సెప్టెంబర్ 30కు, తదుపరి నవంబర్ 30కు పొడిగించింది.
అయినప్పటికీ ఈ పథకం పట్ల ఉద్యోగులు సుముఖత చూపలేదు. అక్టోబర్ 14 వరకు లభించిన వివరాల ప్రకారం 38,5 69 మంది పౌర ఉద్యోగులు యూపీఎస్‌ను ఎన్నుకున్నారు. తర్వాతి స్థానాల్లో రైల్వేస్ (23, 529), రక్షణ (11,144), టెలికం (349) శాఖలు ఉన్నాయి. యూపీఎస్‌ను తక్కువగా స్వీకరించడానికి కారణం అవగాహన లేకపోవడం, జాతీయ పెన్షన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు మూడింట రెండు వంతులు ఉన్న పారా మిలిటరీ, రైల్వే సిబ్బంది ప్రతిఘటన అని చెప్పవచ్చు.