Waqf Law | కేంద్రం కొత్తగా తీసుకువచ్చి వక్ఫ్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణను మే 15న జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. త్వరలోనే జస్టిస్ బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్లు కొత్త సీజేఐ ధర్మాసనం ఎదుట విచారించాలని నిర్ణయించింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.
వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 70 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే కేసును సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఏప్రిల్ 17న సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మే 5వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అలాగే, వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. అన్ని రకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే వక్ఫ్ (సవరణ)చట్టం రూపొందించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తిస్థాయిలో సమాధానం ఇచ్చేందుకు కోర్టును గడువు కోరారు. ఈ మేరకు కేంద్రం వారం రోజులు గడువు ఇస్తూ కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని.. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.