Supreme Court | జైలులో ఇటీవల మృతి చెందిన ముక్తార్ అన్సారీ ఫతేహ (ప్రత్యేక ప్రార్థన) ఈ నెల 10న జరుగనున్నది. జైలులో ఉన్న ఆయన తనయుడు అబ్బాస్ అన్సారీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ సమాధానం కోరింది. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన ముక్తార్ అన్సారీ మార్చి 28న యూపీ బండాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అబ్బాస్ అన్సారీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జాబితా కాలేదు. ఈ క్రమంలో పిటిషన్ను సవరించి ఈ నెల 10న జరిగే ఫతేహాకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఈ మేరకు కోర్టు యూపీ ప్రభుత్వానికి ఈ నెల 9లోగా స్పందన తెలియజేయాలని సూచించింది. కేసు విచారణ మళ్లీ ఈ నెల 9న జరుగనున్నది.