చెన్నై : అధికారులు పోలింగ్ కేంద్రాన్ని దళితుల కాలనీలోకి మార్చడంతో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించాలని అగ్రవర్ణాల ప్రజలు నిర్ణయించిన ఘటన తమిళనాడులోని కంబనేరి పంచాయతీలోని వలసై గ్రామంలో వెలుగుచూసింది. ఎన్నికల నిర్వహణకు సౌకర్యంగా ఉంటుందని పోలింగ్ కేంద్రాన్ని మార్చారని కదయనల్లూర్ యూనియన్ బీడీఓ కందస్వామి తెలిపారు.
గతంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఆది ద్రవిడార్ వెల్ఫేర్ హైస్కూల్లో తాజా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని, కేవలం హిందూ అగ్రవర్ణాల ప్రజలే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు. వలసై గ్రామంలో దళితులు, ముస్లింలు పోలింగ్ కేంద్రం మార్పు పట్ల ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదని తెలిపారు. గ్రామస్తులతో ఈ విషయంపై చర్చలు జరుపుతామని అన్నారు. ఇక పోలింగ్ కేంద్రాన్ని తిరిగి తమ ప్రాంతంలో ఏర్పాటు చేయనిపక్షంలో పోలింగ్‌ను బహిష్కరిస్తామని అగ్రవర్ణాల ప్రజలు తేల్చిచెప్పారు.
రాజకీయ ఒత్తిడితోనే అధికారులు పోలింగ్ కేంద్రాన్ని మార్చారని, తమ అభ్యంతరాలను బీడీఓ, ఇతర అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. కాగా తమ గ్రామంలో పంచాయతీ కార్యాలయం, గ్రామ కార్యాలయ భవనాలను నిర్మించనందుకు నిరసనగా స్ధానిక ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించామని పట్టదైకట్టి పంచాయతీ ఓటర్లు వెల్లడించారు.