న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10న తొలి విడుత పోలింగ్ జరుగనున్నది. అదే నెల 14న రెండో విడుత, 20న మూడో విడుత, 23 నాలుగో విడుత, 27న ఐదో విడుత, మార్చి 3న ఆరో విడుత, 7న ఏడో విడుత పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది.
ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోనున్నది. ఆ లోపు ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయొవచ్చని ఎన్నికల కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, గత సంవత్సరం సెకండ్ వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో 90శాతం మందికి కొవిడ్ టీకా తొలి మోతాదు, 52శాతం మందికి మాత్రమే రెండో మోతాదు అందింది. దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 90శాతం రెండు డోసుల టీకా లక్ష్యం చేరడం పెద్ద సవాల్‌గానే మారింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహుముఖ పోటీ జరుగనున్నది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నది. 2017లో బీజేపీ 312 సీట్లు సాధించింది. మరో వైపు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ పార్టీ చిన్నచిన్న పార్టీలతో కూటమిగా ఏర్పడిన బీజేపీని గద్దెదింపి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నది. జనవాది పార్టీ (సోషలిస్ట్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఎస్బీఎస్పీ, కేశవ్ దేవ్ మౌర్య మహాన్ దళ్, కృష్ణ పటేల్, జయంత్ చౌదరి నేతృత్వంలోని అప్నా దళ్, జయంత్ చౌదరి లోక్‌దళ్ రాష్ట్రీయ పార్టీలతో కూటమి కట్టారు. మరో వైపు కాంగ్రెస్ సైతం ఈ సారి సత్తా చాటాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అలాగే పార్టీని విస్తరించేందుకు చూస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నది. అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన అనంతరం ‘ప్రజాస్వామ్య పండుగను స్వాగతిస్తున్నాం’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం ప్రకటనను స్వాగతించారు. మార్చి 10న విప్లవం వస్తుందని, ఉత్తరప్రదేశ్ మారుతుందని ట్వీట్ చేశారు.