లక్నో: కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, దాబాలు, ఇతర ఆహార విక్రయకేంద్రాలు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శించాలంటూ జారీచేసిన ఆదేశాలపై ప్రతిపక్షాలు సహా సామాన్యులు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇది మత వివక్ష తప్ప మరేం కాదని, చూస్తుంటే ఉత్తరప్రదేశ్ కాస్తా హిటర్ల్ తాలూకు జర్మనీలా ఉందని మండిపడుతున్నారు. పోలీసులు మాత్రం తమ ఆదేశాలను సమర్థించుకుంటున్నారు. భక్తులకు సాయం చేయాలన్న ఉద్దేశమే తప్ప ఇందులో మతపరమైన ఎలాంటి వివక్ష లేదని చెప్తున్నారు. కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు అన్ని రకాల ఆహారపదార్థాలు విక్రయిస్తారని, కాబట్టి యాత్రికుల్లో గందరగోళం తలెత్తి తద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీచేసినట్టు పోలీసులు చెప్పారు.
ఈ ఆదేశాలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఇది దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్ష, హిట్లర్ జర్మనీలోని ‘జుడెన్ బాయ్‌కాట్’ తప్ప మరోటి కాదని మండిపడ్డారు. వ్యాపారులు తమ పేర్లను ప్రదర్శిస్తే కన్వర్ యాత్రికులు ముస్లిం దుకాణాల్లో పొరపాటున కూడా కొనకుండా ఉంటారన్న ఉద్దేశమే ఇందులో కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.