ముంబై, అక్టోబర్ 10: ఓబీసీ క్యాటగిరీ నాన్ క్రిమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే మహారాష్ట్ర ఎస్సీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించే ఆర్డినెన్స్ ముసాయిదాకూ ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. జర్నలిస్టులు, వార్త పత్రికల విక్రేతల సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు, హింగోలీ జిల్లాలోని పసుపు పరిశోధన సంస్థకు రూ.709 కోట్ల అదనపు నిధుల మంజూరు, ప్రజా గ్రంథాలయ చట్టానికి సవరణలు, వివిధ ప్రాంతాలకు నీటి పారుదల ప్రాజెక్టుల మంజూరు, అంగన్వాడీల్లో డే-కేర్ సెంటర్ల ప్రారంభానికి అనుమతి, మదర్సా టీచర్ల గౌరవ వేతనం పెంపు తదితర అంశాలు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నాయి.