లక్నో, జనవరి 23 : వైద్య కళాశాలలో దివ్యాంగుల కోటాలో సీటు కోసం ఒక యువకుడు తన పాదాన్ని నరుక్కున్నాడు. ఈ ఘటన యూపీలోని జాన్పూర్లో చోటుచేసుకుంది. జాన్పూర్కు చెందిన సూరజ్ భాస్కర్ ఎలాగైనా వైద్య కళాశాల్లో సీటు సంపాదించాలని కలలు కనేవాడు. అయితే రెండుసార్లు నీట్ పరీక్షలో ఫెయిల్ కావడంతో రిజర్వేషన్ల కోటాలో అయినా సీటు సంపాదించాలని నిర్ణయించుకుని తన పాదాన్ని నరుక్కున్నాడు.
తర్వాత ఐదు రోజులకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పాదాన్ని నరికారంటూ జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భాస్కర్ పాదాన్ని ఒక యంత్రంతో కోసినట్టు ఉందే తప్ప నరికినట్టు లేదని అనుమానించి లోతుగా విచారించగా నిజాలు బయటపడ్డాయి. ఆయనే స్వయంగా అవయవచ్ఛేదనకు పాల్పడినట్టు గుర్తించారు. ప్రస్తుతం సూరజ్ ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలా అన్న దానిపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.