లక్నో, జూన్ 16: తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేగాక ఆమె అంత్యక్రియల్ని కూడా తన చేతులమీదుగా కాబోయే భర్త పూర్తిచేశాడు. సన్నీ మాదేసియా అనే వ్యక్తితో స్వల్ప వాగ్వాదం తర్వాత ఆదివారం రాత్రి ప్రియాంక (23) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయి. అయితే, ఆమె కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. సోమవారం ఉదయం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, స్థానిక పూజారితో వచ్చిన సన్నీ మాదేసియా.. ఆమె నుదిటిపై సిందూరం దిద్దాడు. పూజారి పెండ్లి మంత్రాలు చదువుతుండగా..వివాహ తంతును తలపించేలా, మృతదేహం చుట్టూ ఏడు చుట్లు తిరిగాడు. చుట్టూ ఉన్నవారంతా ఈ తతంగాన్ని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయారు. ‘ఆమె చివరి కోరికను తీర్చడానికి ఇది నా మార్గం. నేను ఆమెను చాలా ప్రేమించాను’ అని సన్నీ అన్నాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలని అనుకున్నానని చెప్పాడు.