లక్నో: ప్రేమ వ్యవహారం సరిహద్దులు దాటించింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని పెళ్లాడేందుకు ఒక యువకుడు అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. అయితే పెళ్లికి ఆమె నిరాకరించింది. అక్రమ చొరబాటు గురించి తెలుసుకున్న పాక్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (UP man lands in Pak jail) ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా ఖిత్కారి గ్రామానికి చెందిన 21 ఏళ్ల బాదల్ బాబుకు ఫేస్బుక్లో పాకిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల సనా రాణి పరిచయమైంది. గత రెండున్నర ఏళ్లుగా వారిద్దరూ ఆన్లైన్లో ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ యువతిని కలిసి పెళ్లి చేసుకోవాలని అతడు భావించాడు.
కాగా, గత ఏడాది ఆగస్ట్‌లో పని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తన కుటుంబానికి బాబు చెప్పాడు. దీపావళికి ముందు తన కుటుంబానికి వీడియో కాల్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, పని కుదిరిందని తెలిపాడు. మొబైల్ ఫోన్ కొనే స్థోమత లేకపోవడంతో స్నేహితుల ఫోన్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసినట్లు చెప్పాడు.
మరోవైపు ఫేస్బుక్ లవర్‌ను కలిసేందుకు బాబు పెద్ద సాహసం చేశాడు. జమ్ముకశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పంజాబ్ ప్రావిన్స్ మండి బహౌద్దీన్ జిల్లాలోని సనా రాణి గ్రామానికి వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని చెప్పగా ఆ ప్రియురాలు నిరాకరించింది.
కాగా, బాబు అక్రమ ప్రవేశం గురించి తెలుసుకున్న పాకిస్థాన్ పోలీసులు డిసెంబర్ 28న అతడ్ని అరెస్ట్ చేశారు. సనాతోపాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాబుతో ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీశారు. ఆన్లైన్లో ప్రేమించుకున్నామని, అయితే అతడ్ని పెళ్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన బాబును కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 10 వరకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని జైలుకు తరలించారు.
మరోవైపు బాదల్ బాబు పాకిస్థాన్‌లో అరెస్టైనట్లు తెలుసుకుని ఉత్తరప్రదేశ్‌లోని అతడి కుటుంబం షాక్ అయ్యింది. అతడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చించి తమ కుమారుడ్ని విడిపించాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అలీగఢ్ ఎస్పీకి సమర్పించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని తెలియజేస్తానని ఆయన వెల్లడించారు.