లక్నో : లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడు,కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను యూపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. 2021, అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి జిల్లాలోని టికునియ ప్రాంతంలో వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేపట్టిన రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ కేసులో ఆశిష్ మిశ్రా హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్ బెయిల్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం యూపీ ప్రభుత్వ వైఖరిని కోరగా బెయిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ స్పష్టం చేశారు. ఇది తీవ్రమైన నేరమని, ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్లవుతందని ఆమె అభ్యంతరం తెలిపారు.
ఇక బాధితుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే బెయిల్ అభ్యర్ధనను వ్యతిరేకిస్తూ హత్య కేసుల్లో ఎంతో మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గుతుంటే ఆశిష్‌కు మినహాయింపు ఇవ్వడంలో అర్ధం లేదని అన్నారు. ఈ ఘటన మధ్యాహ్నం మూడు గంటలకు జరగ్గా ఆశిష్ ఆ సమయంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్నారని నిందితుడి న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆశిష్ బెయిల్ పిటిషన్‌పై గురువారం రెండు గంటల పాటు వాదనలు విన్న అనంతరం జస్టిస్ సూర్యకాంత్, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీం బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.