లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి స్వామి ప్రసాద్ మౌర్య సోమవారం ఈవీఎంలు, బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. బ్యాలెట్ పేపర్‌పై ఓటింగ్ జరిగి ఉంటే ఎస్పీ 304 సీట్లలో గెలిచేదని, బీజేపీకి 99 సీట్లు వచ్చేవన్నారు. అయితే, ఎన్నికల్లో ఈవీఎంలతో బీజేపీ గేమ్ ఆడిందని ట్విట్టర్లో ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆయన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే ఆయన గతంలో నుంచి పోటీ చేస్తూ వస్తున్న పద్రౌన అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలి.. కొత్తగా ఫాజిల్‌నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి సురేంద్ర కుష్వాహా చేతిలో ఓటమిపాలయ్యారు.
స్వామి ప్రసాద్ మౌర్య 2007 నుంచి 2022 వరకు ఖుషినగర్ జిల్లాలోని పద్రౌన నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2016లో బీజేపీలో చేరే ముందుకు బీఎస్పీ పార్టీలో చేస్తున్నారు. స్వామి ప్రసాద్ ఓటమికి ఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇలియాస్ అన్సారీ తిరుగుబాటే కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఫాజిల్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,98,835 ఓట్లున్నాయి. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేంద్ర కుష్వాహాకు 1,03,313, ఎస్పీ అభ్యర్థి స్వామి ప్రసాద్ మౌర్యకు 62,894 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి మహమ్మద్ ఇలియాస్ అన్సారీకి 26,495 ఓట్లు పోలయ్యాయి.