Crime news : ‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు. పోయే ప్రాణాలను సైతం నిలబెడుతారు కాబట్టి వైద్యులను మన పూర్వీకులు భగవత్సమానులుగా కీర్తించారు. కానీ లంచాలకు మరిగిన కొందరు వైద్యులు (Doctors) మాత్రం ఆ వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో అలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. అడిగినంత లంచం ఇవ్వలేదనే కారణంతో ఓ వైద్యుడు అతికించిన బాలిక కాలును మళ్లీ విరగ్గొట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌కు చెందిన రేష్మ.. తన 14 ఏళ్ల కుమార్తె కాలు విరగడంతో అపరేషన్ చేయించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే బాలికకు ఆపరేషన్ చేయాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాలని అక్కడి ఆర్థో సర్జన్ డిమాండ్ చేశాడు. దాంతో రేష్మ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను సంప్రతించింది. తాను వితంతువునని డాక్టర్‌కు లంచం ఇచ్చేంత డబ్బు తనదగ్గర లేదని చెప్పింది. దాంతో ఉచితంగా సర్జరీ చేయాలని వైద్యుడిని సీఎంవో ఆదేశించారు. అయినా ఆ డాక్టర్ లెక్కచేయలేదు.
దాంతో రేష్మ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. కలెక్టర్ బాలికకు ఉచితంగా ఆపరేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. సీఎంవో రెండోసారి ఆదేశించడంతో సర్జరీ చేసేందుకు ఒప్పుకున్న డాక్టర్.. తీరా సర్జరీకి ముందు మళ్లీ డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దాంతో రేష్మ తన దగ్గర ఉన్న రూ.8 వేలు ఇచ్చింది. మిగతా డబ్బులు సర్జరీ తర్వాత ఇస్తానని ఒప్పుకుంది. నెలన్నర క్రితం సర్జరీ జరిగింది. అయినా రేష్మ మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో డాక్టర్ రివ్యూ పేరుతో ఆస్పత్రికి పిలిపించారు.
రివ్యూ కోసం తన కుమార్తెను తీసుకొచ్చిన రేష్మను మరోసారి మిగిలిన లంచం డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర అంత డబ్బులేదని చెప్పింది. అనంతరం చెకప్ పేరుతో బాలికను లోపలికి పిలిపించుకున్న డాక్టర్ అతికించిన కాలును మళ్లీ విరగ్గొట్టాడు. దాంతో బాలిక నొప్పితో విలవిల్లాడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో సీఎంవోను ఆరాతీసింది. అయితే ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వైద్యుడు ఉద్దేశపూర్వకంగానే కాలు విరిచినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.