Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ప్రజలకు తోడేళ్లు (Killer wolfs) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచి వేస్తోంది. వీటి దాడిలో సుమారు 34 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది.
ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇప్పటివరకూ నాలుగు తోడేళ్లను పట్టుకుంది. మిగతా రెండింటిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో తోడేళ్ల దాడులు మాత్రం ఆగడం లేదు. సోమవారం రాత్రి కూడా ఐదేళ్ల పాపపై దాడి చేసి గాయపర్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అధికారులతో ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తోడేళ్లను పట్టుకోవడం సవాల్‌గా మారుతోందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాని తరుణంలో అవి కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు (shoot at sight order). అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేశారు.
సుమారు 50 రోజుల నుంచి బహరాయిచ్ సహా మరికొన్ని జిల్లాలో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
Also Read..
YS Sharmila | ఆయన ఎందుకు స్పందించలేదు?.. వైఎస్ జగన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ జగన్.
Paralympics 2024 | 50 మీటర్ల రైఫిల్ ఫైనల్లో అవని.. చరిత్ర సృష్టిస్తుందా..?
Simba is Coming | సింబా ఈజ్ కమింగ్ అంటోన్న ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యూపై హింట్ ఇచ్చాడా..?