YS Sharmila | ముంబై నటి కాదంబరీ జత్వానీ వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని అన్నారు. తిరగబడిన ఆమె కేసు పెట్టేందుకు వెళ్తే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని విమర్శించారు.
ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేయడం దుర్మార్గమని షర్మిల విమర్శించారు. వైఎస్ జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇలా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్.. జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని జగన్‌పై మండిపడ్డారు.
సజ్జన్ జిందాల్, జగన్ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెబుతున్నారని షర్మిల గుర్తు చేశారు. జిందాల్‌కు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో సమాధానం చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్‌పై ఏ మాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తోందని షర్మిల విమర్శించారు.మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇద్దరూ కూడా బీజేపీకి ఊడిగం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఇంత బానిసలుగా ఎందుకు తయారయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.