Yogi Adityanath | మరోమారు ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 25న సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌తోపాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్నోలోని ఏబీ వాజపేయి గ్రౌండ్స్‌లో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని అదనపు చీఫ్ సెక్రటరీ నవీన్ సెహ్గల్ తెలిపారు. సుమారు 75 వేల మంది ప్రజలు కూర్చునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొననున్నారని సమాచారం. యోగి క్యాబినెట్లో 20 మందికి క్యాబినెట్ హోదా, మరో 20 మందికి స్వతంత్ర, సహాయ హోదా కల్పిస్తారని తెలుస్తున్నది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లు, దాని మిత్రపక్షాలు 18 చోట్ల గెలుపొందాయి.