(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నిరసన గళాలను నొక్కేయాలి. ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపాలి.. ఇదీ బీజేపీ నేతలకు తెలిసిన ఏకైక విద్య. ‘సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు గుణపాఠం చెప్పాలి’ అంటూ కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా చేసిన వ్యాఖ్యలు యూపీలోని లఖింపూర్‌లో నలుగురు అన్నదాతల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. తాజాగా అదే యూపీలోని ఆజంగఢ్ బీజేపీ ఎంపీ దినేశ్ లాల్‌యాదవ్ అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశారు. మండౌరీ ఎయిర్‌స్ట్రిప్‌ను విస్తరించేందుకు 600 ఎకరాల భూసమీరణకు సర్కార్ సిద్ధమైంది.
పరిహారంపై గ్రామస్థులతో చర్చలు జరుపకుండానే ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో భూములను కోల్పోయే 8 గ్రామాల్లోని 10 వేల మందికి పైగా ప్రజలు.. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా 43 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనపై దినేశ్‌లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటివారి వల్లే ఆజంగఢ్ వెనుకబడిపోతున్నది. మన మాట వినని వారిని జైలులో పెట్టండి. వాళ్ల మోకాళ్లు విరగ్గొట్టండి లేదా చంపి పారేయండి’ అంటూ పోలీసులను ఎగదోశారు. దినేశ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న గ్రామస్థులు, ఎస్కేఎం నేతలు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. శనివారం లక్నోలోని రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ప్రకటించింది.