లక్నో : యూపీ ఏఐఎంఐఎం చీఫ్ షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము మూడు పెండ్లిండ్లు చేసుకుంటామని ప్రజలు చెబుతుంటారని, తాము రెండు పెండ్లిండ్లు చేసుకున్నా సమాజంలో ఇద్దరు భార్యలకు గౌరవం ఇస్తామని అన్నారు. కానీ మీరు (హిందువులు) ఒకరినే వివాహం చేసుకుని మరో ముగ్గురు శ్రీమతులను కలిగిఉంటారని, అయినా భార్యకు, శ్రీమతులకు గౌరవం ఇవ్వరని షౌకత్ అలీ అన్నారు.
తాము రెండు పెండ్లిండ్లు చేసుకున్నా ఇద్దరు భార్యలనూ గౌరవిస్తామని, రేషన్ కార్డుపైనా తమ పిల్లల పేర్లు ఉంటాయని చెప్పారు. హిజబ్ నిషేధంపై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల యూపీ ఎంఐఎం చీఫ్ స్పందిస్తూ దేశంలో ఎవరు ఏం ధరించాలన్నది హిందుత్వ నిర్ణయించదని, రాజ్యాంగం నిర్ధేశిస్తుందని అన్నారు.
ఇలాంటి అంశాలను లేవనెత్తి ప్రజల మధ్య విభజనను తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మదర్సాలు, మూక దాడులు, వక్ఫ్, హిజబ్ వంటి అంశాలతో బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. కాషాయ పార్టీ బలహీనపడిన సందర్భాల్లో బీజేపీ నేతలు ముస్లింలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతారని అన్నారు.