Layoffs | న్యూఢిల్లీ: ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 130 కంపెనీలు కలిసి 61 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 13న మైక్రోసాఫ్ట్ 6 వేల మంది ఉద్యోగులను తొలగించింది. డైనమిక్ మార్కెట్లో పోటీదారుగా నిలవడానికి, కంపెనీ పునర్ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
మరోవైపు, యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సుమారు 1500 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగాల కోతకు దిగింది. ఇక ఈ నెలలో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. కస్టమర్ సర్వీస్ మెరుగు పరచడానికి, కంపెనీ పునర్ నిర్మాణానికి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు చెప్పింది. కంపెనీ ఆపరేషన్స్ క్రమబద్దీకరించడానికి ఈ నెలలో వంద మందిని తొలగించినట్టు అమెజాన్ పేర్కొంది.
ఏఐ-కోడింగ్ మాత్రమే కాదు దానిపై ఆధారపడి పని చేసినా ఉద్యోగాలు పోయేటట్టు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీలో జరిగిన తాజా ఉదంతమే అందుకు ఉదాహరణ. బ్లూంబర్గ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో ఇటీవల తొలగించిన ఉద్యోగుల్లో 40 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. వీరిలో కొందరిని కొన్ని నెలల ముందు ఏఐ టూల్స్ మీద ఆధారపడి పనిచేయమని కంపెనీ సూచించింది.
కానీ ఇటీవల వారి ఉద్యోగ విధులను ఏఐ భర్తీ చేయడంతో వారు కొలువులు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ ఇంజినీర్లు తమకు తెలియకుండానే తమ ప్రత్యామ్నాయాలకు శిక్షణ ఇచ్చారా అన్న ప్రశ్న తలెత్తింది. ఇటీవల తమ కోడింగ్ వర్క్‌లో మూడో భాగం కృత్రిమ మేధనే చేస్తున్నదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.