పుణే: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్‌నగర్ జిల్లాలో రాజుకున్న మత చిచ్చులో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వందలాది షాపులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అహ్మద్‌నగర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం మత ఘర్షణలకు దారితీసింది.
ఈ సందర్భంగా జరిపిన దాడు లు, రాళ్లు రువ్వుకున్న సంఘటనలలో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమైనట్టు సోమవారం పోలీసులు తెలిపారు. అహ్మద్‌నగర్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలోని షెవ్‌గావ్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఒక ఊరేగింపు మత ఘర్షణకు దారితీసింది. హింస చెలరేగడంతో పోలీసులు 32 మందిని అదుపులో కి తీసుకుని, 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఘర్షణలో ఒకరి మృతి
సోషల్ మీడియాలో పెట్టిన ఒక మతపరమైన పోస్టు వివాదానికి దారి తీసింది. ఆకోలా నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు సహా 8 మంది గాయపడ్డారు.
ముస్లింల ఓట్లు అడ్డుకునేందుకే…
మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బదిలీ అవుతున్న ముస్లింల ఓట్లను అడ్డుకోవడానికి అల్లర్లు జరుగుతున్నాయని శివసేన (యూబీటీ) నేత, మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఆరోపించారు. బజరంగ్‌బలి నినాదంతో కర్ణాటకలో అధికారంలోకి వద్దామనుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందని అన్నారు.