ఛత్తీస్గఢ్, ఫిబ్రవరి 13 : మేజర్ అయిన భార్యతో ఆమె అంగీకారం లేకపోయినా శృంగారంలో పాల్గొనడం, అసహజ సంభోగం నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆమె భర్తపై ఐపీసీ సెక్షన్ 375(అత్యాచారం), సెక్షన్ 377(అసహజ శృంగారం) కింద శిక్ష విధించడానికి వీలు లేదని తెలిపింది. గోరఖ్నాథ్ శర్మ అనే వ్యక్తి తన భార్యతో అసహజ శృంగారానికి పాల్పడటంతో ఆమె తీవ్ర నొప్పితో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించింది. మరణ వాంగ్మూలం రికార్డు చేసిన సమయంలో ఆమె తన భర్త చర్యను బయటపెట్టారు. దీంతో ట్రయల్ కోర్టు గోరఖ్నాథ్ శర్మకు ఐపీసీలోని 375, 377, 304 సెక్షన్ల కింద పదేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును అతడు ఛత్తీస్గఢ్ హైకోర్టులో అప్పీల్ చేయగా జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం తాజాగా తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 375కు 2013లో చేసిన సవరణ ప్రకారం మేజర్ అయిన భార్యతో భర్త శృంగారం, ఇతర లైంగిక చర్యల్లో పాల్గొనడం నేరం కాదని కోర్టు పేర్కొన్నది.