లక్నో ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన మరో విచిత్రం వెలుగుచూసింది. ఓటు చౌర్యం జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘంపై(ఈసీఐ) రాజకీయ పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఓ బ్రహ్మచారి సాధువుకు 50 మంది కుమారులు ఉన్నట్లు చూపుతున్న ఓటరు జాబితా వెలుగులోకి వచ్చింది. ఆ స్వామీజీకి ఉన్నట్లు చెబుతున్న కుమారులలో అతి పెద్ద వయస్కుడికి 72 ఏళ్లు, అతి చిన్న వయస్కుడికి 28 ఏళ్లు ఉన్నాయి.
తీవ్ర వివాదంగా మారిన ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈసీ నిష్పాక్షికతపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఓటరు జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం వారణాసిలోని రామజానకి ఆలయ వ్యవస్థాపకుడు స్వామి రామ్‌కమల్ దవాస్ 50 మంది ఓటర్లకు తండ్రి. ఆయన చిన్న కుమారుడు రాఘవేంద్రకు 28 ఏళ్లు కాగా పెద్ద కుమారుడు బన్వారీ దాస్‌కు 72 ఏళ్లు. 50 ఏళ్ల స్వామి రామ్‌కమల్ దాస్ అవివాహితులు. ఈసీ సృష్టించిన మరో అద్భుతం చూడండి. 50 మంది పిల్లలకు తండ్రిగా రామ్‌కమల్ దాస్‌ని ఈసీ చూపించింది. చిన్న తప్పిదంగా ఈసీ కొట్టిపారేస్తుందా, మోసాన్ని అంగీకరిస్తుందా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.