శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్ (ఈసీ), మూడు పోలింగ్ స్టేషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. (unique polling stations) నియంత్రణ రేఖలో ఒకటి, దాల్ సరస్సులో తేలియాడే బోటులతోపాటు దేశంలోనే తొలి పోలింగ్ కేంద్రం కూడా ఇక్కడ ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కొరగ్బల్, సీమారి, దాల్ లేక్ ఫ్లోటింగ్ పోలింగ్ స్టేషన్ల ప్రత్యేకతలను ఆయన వివరించారు.
కాగా, గురేజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొరగ్బల్ భారత్, పాకిస్థాన్ భూభాగాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి ఉన్నది. ఇక్కడి పోలింగ్ కేంద్రం వంద శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభాకు ఎంతో ప్రత్యేకం. 2024 లోక్‌సభ ఎన్నికలలో కొరగ్బల్ పోలింగ్ కేంద్రంలో 80.01 శాతం ఓటింగ్ నమోదైంది.
మరోవైపు కుప్వారా జిల్లాలో సీమారి పోలింగ్ కేంద్రం దేశంలోనే మొదటి పోలింగ్ కేంద్రం. లాజిస్టికల్, భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ స్థిరంగా అధిక ఓటింగ్‌ను సాధిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఇక శ్రీనగర్‌లోని ఐకానిక్ దాల్ సరస్సులో మూడు తేలియాడే పోలింగ్ సెంటర్లు ఉంటాయి. పోలింగ్ బృందాలను తీసుకెళ్లేందుకు ఫెర్రీలు, షికారాలు ఉపయోగిస్తారు. దాల్ సరస్సులోని ఖర్ మొహల్లా అబి కర్పోరా పోలింగ్ కేంద్రం కేవలం ముగ్గురు ఓటర్లకు మాత్రమే సేవలందించనున్నది.
కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Unique #PollingStations #Koragbal #Seemari #DalLake#ECI does #WhateverItTakes to reach every last voter traversing the difficulties of terrain or otherwise.#J&KElections pic.twitter.com/crkk3FccUi
— Election Commission of India (@ECISVEEP) August 16, 2024