Venezuela President : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) ను అమెరికా సైన్యం బంధించడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ (Delcy Rodriguez) నియమితులయ్యారు. రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది. అమెరికా సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడి చేసి.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్యను తీసుకెళ్లింది.
దాంతో పరిపాలనా కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. లిగా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్ ఆంటోనియో కుమార్తె అయిన డెల్సీ రోడ్రిగ్స్ 1969లో కారకాస్‌లో జన్మించారు. మదురో ప్రభుత్వంలో ఆమె కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2018లో ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షురాలి స్థానంతోపాటు ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖల మంత్రిగా కొనసాగారు.
వెనెజువెలాలోని చమురు కోసం ట్రంప్ సుంకాలు విధించిన వేళ ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి బయటపడేయడంలో డెల్సీ కీలకపాత్ర పోషించారు. మదురోకు విశ్వసనీయురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా అధ్యక్షుడు సైతం మద్దతిస్తున్నట్లు తెలిసింది. వెనెజువెలాను మళ్లీ గొప్పగా మార్చడానికి ఏం అవసరమో.. ఆ పనులను చేయడానికి డెల్సీ రోడ్రిగ్స్ సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సరైన పరివర్తన వచ్చే వరకు వెనెజువెలా అమెరికా పిడికిటే ఉంటుందని స్పష్టం చేశారు.