Hardeep Puri : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతుండటంతో కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. దేశంలో 2022 నుంచి చమురు ధరల్ని కేంద్రం పెంచలేదనే విషయాన్ని ఆయన గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ఇండియాలో చమురు ధరలు స్థిరంగానే ఉన్నాయన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోయి, చమురు రవాణాలో ఆటంకాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాతోపాటు అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. భౌగోళిక అనిశ్చితులు, రాజకీయ పరిస్థితులు ఎదురైనా ఇండియా ధీటుగా ఎదుర్కొందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. దేశంలో సరిపడినంత ఆయిల్ రిజర్వులు ఉన్నాయని చెప్పారు.
ఫిబ్రవరి 2022 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, వినియోగదారులపై భారం పడకుండా చూసుకున్నామని మంత్రి అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం వంటివి ఎదురైనా చమురు భారం పడనివ్వలేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల చమురు ధరలు స్థిరంగానే ఉన్నాయని, గృహవినియోగదారులకు ధరల నుంచి రక్షణగా ఉన్నాయన్నారు. చమురుపై కేంద్రం సుంకాల్ని కూడా తగ్గించిందని హర్దీప్ సింగ్ గుర్తు చేశారు.