న్యూఢిల్లీ, జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోయిందంటూ పలువురు వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వివరణ ఇస్తూ ఈ20 పెట్రోల్ వాహనాల మైలేజ్‌పై కొంత ప్రభావం చూపవచ్చునని తెలిపారు. అయితే కేవలం ఇథనాలే కాకుండా, అనేక కారణాల వల్ల వాహనాల మైలేజ్ తగ్గవచ్చునని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోయిందని కొందరు చెప్పారు. రేసింగ్ కార్లలో కూడా ఇథనాల్ ఉపయోగిస్తారనే విషయం ఇప్పుడు సుస్థిరమైంది.
వేగ వృద్ధి రేటు మెరుగుపడుతుంది. నాకింగ్ కూడా మెరుగుపడింది. ఇక మైలేజ్ సంగతికొస్తే.. నిజమే మైలేజ్ కొద్దిగా తగ్గింది. అయితే పలు కారణాల వల్ల అది సంభవించవచ్చు’ అని పేర్కొన్నారు. భారతదేశంలోని వాహన తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎం), ఆటోమొబైల్ పరిశోధన, పరీక్షలు, సర్టిఫికేషన్ సంస్థ ఆటోమేటివ్ రిసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సహా సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టినట్టు మంత్రి తెలిపారు. ఇక వాహనాలపై ఉన్న బీమా రక్షణ గురించి మాట్లాడుతూ కొందరు ఇకపై దీనికి బీమా రక్షణ ఉండదు అని ప్రచారం చేస్తున్నారని, అయితే అలాంటిదేమీ లేదన్న విషయాన్ని బీమా సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయని మంత్రి తెలిపారు.