Kaushal Kishore | మద్యం కారణంగా తమ కుటుంబం ఎంతో నష్టపోయిందని, మా మాదిరిగా మీరు కూడా కడుపుక్షోభ అనుభవించొద్దని చెప్తున్నాడు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్. ఆల్కహాల్ తాగేవాడి కన్నా ఓ రిక్షాపుల్లర్ గానీ, ఓ కూలీ గానీ మంచి పెండ్లికొడుకవుతాడని తెలిపాడు. మద్యానికి అలవాటైన కుమారుడిని పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ కంటనీరు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో డి-అడిక్షన్పై నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ హాజరై ప్రసంగించారు.
‘నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కుమారుడు ఆకాష్ కిషోర్ మద్యానికి బానిసగా మారాడు. చెడు స్నేహం వల్ల మద్యం తాగడం అలవాటైంది. డి-అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. చెడు అలవాటు మానేస్తానని చెప్పి 6 నెలలకే పెండ్లి చేసుకున్నాడు. అయినా మళ్లీ మద్యం తాగడం మొదలుపెట్టాడు. అది చివరకు తన మరణానికి దారితీసింది. రెండేండ్ల క్రితం ఆకాష్ కిషోర్ చనిపోయే నాటికి అతడి కుమారుడు రెండేండ్ల వయసు వాడు. కట్టుకున్న భార్యను అనాథగా వదిలి వెళ్లిపోయాడు. పిల్లాడు తండ్రిలేని అనాథ అయ్యాడు. ఇప్పుడు వారు నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు’.. అని తన వ్యక్తిగత అనుభవాన్ని సమావేశంలో వివరించి చెప్పడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
అందుకే ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. తాగుబోతులకు మీ అమ్మాయిని ఇచ్చి వారి గొంతు కోయకండి. వారి అందమైన జీవితాన్ని తాగుబోతుల చేతుల్లో పెట్టకండి అని వేడుకుంటున్నా అని మంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. మద్యం తీసుకునే తమ్ముళ్లారా పెండ్లి చేసుకోకండి అని కూడా సలహా ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారితో పోరాడి 6.32 లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, కేవలం మద్యం వ్యసనం కారణంగా ఏటా 20 లక్షల మంది మరణిస్తున్న విషయం మరిచిపోవద్దని చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పారు. సిగరెట్, బీడీ, ఆల్కహాల్ బానిసలను కాపాడేందుకు ఎన్జీవోలు డి-ఎడిక్షన్ కేంద్రాలను నడపాలని కోరారు.