ముంబై: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చేర్చుకోవడం వల్ల తమ పార్టీ ఆర్పీఐ(ఏ)కు చోటు దక్కలేదని అన్నారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే, పాల్గఢ్ జిల్లాలోని దహానులో మీడియాతో మాట్లాడారు. ‘మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన తర్వాత మహారాష్ట్ర కేబినెట్లో ఆర్పీఐ (ఎ)కు మంత్రి పదవి రాలేదు. మా పార్టీకి క్యాబినెట్ పదవులు, రెండు కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా స్థాయి కమిటీ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అజిత్ పవార్ చేరికతో ఇవేమీ జరుగలేదు’ అని అన్నారు. అయితే రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్పీఐ(ఏ)కు 12 సీట్లు కేటాయించాలని రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
కాగా, మరాఠా రిజర్వేషన్ అంశాన్ని మొదట లేవనెత్తింది తమ పార్టీనే అని అథవాలే తెలిపారు. ప్రత్యేక కేటగిరీ కింద మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కింద వారిని చేర్చడం వల్ల ఆ వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నారు. ‘తమిళనాడు రిజర్వేషన్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలి. ప్రతి ఏటా రూ. 8 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు చెందిన మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలి’ అని అన్నారు. వక్ఫ్ (సవరణ) బిల్లు 2024కు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు.