బెంగళూరు: బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మహిళ నుంచి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్జోషిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన కుటుంబానికి బీజేపీ టికెట్ ఇప్పిస్తానని గోపాల్‌జోషి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే దేవావంద్ ఫూల్సింగ్ చౌహాన్ భార్య సునీతా చౌహాన్ గురువారం రాత్రి బసవేశ్వరనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై గోపాల్‌జోషి, విజయలక్ష్మిజోషి, గోపాల్ కుమారుడు అజయ్జోషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయలక్ష్మి తనను తాను ప్రహ్లాద్‌జోషి సోదరిగా పరిచయం చేసుకున్నట్టు సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోపాల్ జోషి అరెస్టుపై పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. తనకు అక్కచెల్లెళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. గోపాల్ జోషితో మూడు దశాబ్దాల క్రితమే సంబంధాలు తెగిపోయాయని తెలిపారు.